Thursday 7 February 2013

ఐ హేట్ గవర్నమెంట్ స్కూల్స్ రే.....!!!





రోజు వ్యాన్ కాస్త రిపేర్ ఉందిసార్... మీరే ఎలాగైనా బాబును తీసుకెళ్ళండని ఫోన్ రావటంతో,
ట్యూషన్ నుంచి మావాణ్ణి తీసుకురావటానికి వెళ్ళా!
మా వాడితో పాటు ఇంటికి దగ్గర్లోనే ఉండే మరో అబ్బాయి కూడా కారెక్కాడు...
మా వాడు చదివేది కేంద్రీయ విద్యాలయ... ఆ అబ్బాయిది.... ప్రైవేటు కాన్వెంట్ స్కూలు...
ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు....
ఆ అబ్బాయికి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు వచ్చిందనీ ... అక్కడికి వెళ్ళిపోతున్నాననీ చెప్పాడు...
వాళ్ళిద్దరి మాటల్లో మరో మిత్రుడి ప్రస్తావన వచ్చింది.... అతనే స్కూల్ అని అడిగాడు ఆ అబ్బాయి...
మావాడు.... స్కూల్ పేరు  చెప్పాడు...!
ప్రైవేటా? గవర్నమెంటా? అన్నాడా అబ్బాయి....
నాన్నా ఏదో అంటారుగదా వాటిని... అని నా వైపు తిరిగాడు...
ఎయిడెడ్ స్కూల్ అని చెప్పా...
అంటే స్కూల్ కు గవర్నమెంట్ సాయం చేస్తుంది.... అని వివరించా...!
‘‘ఐ హేట్ గవర్నమెంట్ స్కూల్స్ రే’’ అన్నాడా అబ్బాయి ఉన్నట్టుండి...
మా వాడికి కాస్త అహం దెబ్బతింది... మాది సెంట్రల్ గవర్నమెంటు స్కూల్ అన్నాడు...
సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంటే గదా అన్నాడా అబ్బాయి...
కానీ మా స్కూల్లో బాగా చెబుతారు తెలుసా? అని సమర్థించుకున్నాడు మావాడు...
వాళ్ళ సంభాషణలోకి దూరి... గవర్నమెంటు స్కూలంటే ఎందుకు అసహ్యం అని అడగాలనిపించింది... అంతలోనే....
ఆ అబ్బాయి.... ‘‘కోరుకొండ స్కూల్లో చదివితే ఎన్.డి.ఎ. లో సీటొస్తుంది... తర్వాత మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందట... మా నాన్న చెప్పాడు... అందుకే వెళుతున్నా... ’’ అని చెప్పాడు...
మా వాడు... కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రైవేటా? గవర్నమెంటా? అని అడిగాడు!
అంతలో ఆ అబ్బాయి ఇల్లొచ్చింది... బాయ్ రా.... ... థ్యాంక్స్ అంకుల్... అంటూ దిగిపోయాడు...
సమాధానం ఇవ్వకున్నా.... ఆ అబ్బాయి మనసులో మా వాడు అడిగిన ప్రశ్న గింగురుమంటుందని నాకు తెలుసు...

నిజమేగదా.....
మనకు గవర్నమెంటు... స్కూళ్ళకు వెళ్ళం...
గవర్నమెంటు ఆస్పత్రులకు వెళ్ళం....
గవర్నమెంటు ఉద్యోగం మాత్రం కావాలి....
మన పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం...
అందుకే ఇందాక ఆ అబ్బాయి అలా అనటంలో తప్పులేదనిపించింది...
నిజానికి ఆ అబ్బాయి చదువుతోంది... మంచి కాన్వెంట్ లోనే అయినా మళ్ళీ ట్యూషన్ పంపించటం తప్పనిసరి అవుతోంది...
ఇప్పుడు వెళుతోంది కూడా కోరుకొండ సైనిక్ స్కూలు గవర్నమెంటుదే...

నిజానికి ప్రైవేటు వాటితో పోలిస్తే... గవర్నమెంటు స్కూళ్ళలో మంచి శిక్షణ పొందిన టీచర్లుంటారు...
అయినా మనకు వాళ్ళపై నమ్మకం ఉండదు...
కారణం.... పట్టించుకొని చెప్పరని.... శ్రద్ధ తీసుకోరేమోనని...
ఇందులో కొంత నిజం కూడా లేకపోలేదు....
మా చెల్లి గవర్నమెంటు స్కూల్లో ఫిజిక్స్ చెబుతుంది....
చెప్పాలన్న తపన ఉంది.....
‘‘ఈ పిల్లలకు ఎంత చెప్పినా బుర్రలకు ఎక్కదురా? అందోసారి....
జెమ్స్ కు నువ్వు చెప్పేదేంటి? యావరేజ్ బిలో యావరేజ్ లాంటి వారికి చెప్పి పైకి తీసుకొస్తేనే గొప్ప అన్నాను...
‘‘ జెమ్స్ అని కాదు...  వీళ్ళలోనూ మంచిగా చదివేవాళ్ళు... కష్టపడితే తయారయ్యేవాళ్ళూ ఉంటారు... కానీ ఒకరో ఇద్దరో... మిగిలిన వాళ్ళంతా... మెజార్టీ.... బిలో యావరేజ్ లాంటి వారికంటే తక్కువ స్థాయి వాళ్ళు ! గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలాంటి వాళ్ళే మిగులుతున్నారిప్పుడు... ఏమాత్రం కొద్దిగా చదివించే స్థోమత ఉన్నా ప్రైవేటుకే పంపిస్తున్నారు. నా బిడ్డనే తీసుకో.... ప్రైవేటుకే పంపిస్తున్నాను... అక్కడి టీచర్లకు పద్ధతిగా చెప్పటం రాదని నాకు తెలుసు... మాకంటే బాగా చెప్పలేరనీ తెలుసు... అలాగని మా స్కూల్లో వేయలేను... వేసే రిస్క్ తీసుకోలేను... అక్కడ రుద్దయినా చదివిస్తారు... ఇక్కడ మేం... బాగానే చెబుతాం... కానీ... శ్రద్ధ తీసుకోం... హోం వర్క్ల్ లివ్వం... ఇచ్చినా చేశారా లేదా అని చూడం... మేం చెప్పినా చెప్పకున్నా పట్టించుకునే వాళ్ళు లేరు... ఒకవేళ నేను బాగా చెప్పినా... అందరు టీచర్లూ అలాగే చెబుతారని గ్యారెంటీ లేదు..  కాబట్టి నా బిడ్డను చేర్పటానికి నాకు ధైర్యం లేదు...’’

అంటూ ఏకరువు పెట్టింది....

మా చిన్నప్పుడు ఊర్లో ఒకటే గవర్నమెంటు స్కూలుండేది...
కలెక్టర్ కొడుకైనా... కూలీ పిల్లలైనా దానికే రావాలి.... టీచర్ల పిల్లలైనా అంతే...
కాబట్టి స్కూళ్ళలో చదువు శ్రద్ధగా ఉండేది....
.కనీసం. ఉన్నట్లు అనిపించేది...
కానీ ఇప్పుడు ... మానసికంగా మనకు ఆ ధైర్యం లేదు...
టీచర్లకు లేదు... సమాజానికి లేదు....
ప్రైవేటులో వేస్తే మా వాళ్ళు వెనకబడి పోతారేమో.... అనే ఆందోళన!
ప్రైవేటుస్కూళ్ళతో పోటీపడి మంచి విద్యార్థులను తయారు చేస్తున్న మంచి గవర్నమెంటు స్కూళ్ళు ఉన్నాయి... కానీ వాటి సంఖ్య చాలా తక్కువ.
కోరుకొండ సైనిక్ స్కూలు గవర్నమెంటుదే....
కేంద్రీయ విద్యాలయాలు... గవర్నమెంటువే...
నవోదయలు... గవర్నమెంటువే...
వాటిలో చోటు కోసం ఎందుకని తపిస్తున్నారు...
కారణం... అక్కడ క్రమశిక్షణ... ఉంటుందనే నమ్మకం
వాతావరణం బాగుంటుందని నమ్మకం...

వసతులు బాగా ఉంటాయని నమ్మకం...

టీచర్లు బాగా చెబుతారనే నమ్మకం....

చదువొస్తుందనే నమ్మకం...

ఇవన్నింటిలో వాస్తవంగా లోపాలున్నా...కేవలం నమ్మకం ఒకటే వాటి వైపు ఆకర్షింపజేస్తుంది...

 అదే నమ్మకం  రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళపై లేదు...

టీచర్ల, గవర్నమెంటు ఉద్యోగుల పిల్లలను తప్పనిసరిగా గవర్నమెంటు స్కూళ్ళలోనే చదివించాలని అని ఆదేశాలిస్తే పరిస్థితి మారుతుందేమో?
ఇది చెట్టు ముందా... విత్తనంముందాలాంటిదే...

2 comments:

  1. పాత కాలం మిద్దెలు అంటే డౌటొచ్చింది. మీది కరీంనగర్ జిల్లానా? ఏ ఊరు?

    ReplyDelete
    Replies
    1. లేదండి... కానీ దగ్గరే...! ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు...

      Delete