Monday 4 February 2013

వీక్.... ఎండ్.....





నాన్నా.... వీకెండ్ కదా... ఎక్కడికైనా పోదామా?
ఎక్కడికిరా? అన్నాను...
ఎక్కడికైనా... తీసుకెళ్ళు....
బిర్లామందిర్? అన్నాను...
ఎప్పుడూ గుళ్ళేనా.... ఏదైనా ఆడుకునే ప్లేస్ కు తీసుకెళ్ళు....
ఐమాక్స్ కు....  లేదంటే జలవిహార్.....
మొదలు ఎక్కడికైనా అన్నవాడు.... ఇలా లిస్ట్ చెప్పేస్తున్నాడు...
చివరకు అలా తిరిగి.... ఫలానా చోట తినేసి వద్దాం... అంటూ ముగించేశాడు...

మా చిన్నప్పుడు ఇలాగే అడిగామా అమ్మానాన్నల్ని?
నాకైతే ఎన్నడూ అడిగినట్టు గుర్తులేదు...
అసలు వీకెండ్ అనే కాన్సెప్టే తెలీదు...
తెలీదేంటి... అసలు లేనే లేదు...

శనివారం... ఆదివారాలకు ప్రత్యేకతమీ లేదు....
వీకెండ్ అంటూ వాటిని మిగిలిన వారాల్లోంచి వేరు చేసి చూసింది లేదు....
ఆ రెండు రోజుల్లో ఎటు వెళ్ళాలంటూ.... ప్లానింగ్ చేసింది లేదు.....

ఆ మాటే అంటే.... మావాడు ఏం ఎందుకలా? మరి శని, ఆదివారాలేం చేసేవారు? అన్నాడు....
అవును నిజమే...  ఏం చేసేవారం?
ఇప్పుడనిపిస్తున్న వీకెండ్ అప్పుడెందుకు అనిపించలేదు?

ప్రతిరోజూ స్కూల్ నుంచి రాగానే... బ్యాగ్ లు పడేసేది... ఆడుకోవటానికి వెళ్ళేది....
సాయంత్రం వచ్చాక.... అరగంటో... గంటో చదువుకొని... నిద్రపోయేది....
అంతే... రోజూ ఇదే తంతు....
ఆటలంటే ఎన్ని ఆటలని...?
క్రికెట్... వాలీబాల్, బ్యాడ్మింటన్.... కబడ్డీ... బాల్ బ్యాడ్మింటన్..... ఆడని ఆటలేదు...
గమ్మత్తమేంటంటే....
అప్పటిదాకా... మాకు చదువు చెప్పిన టీచర్లే సాయంత్రం అయ్యేసరికి మాతో పాటు కలసి ఆడేవాళ్ళు...
భలే ఉండేది..... ఇవే కాదు....
వానలు పడగానే.... సలాక (ఇనుప చువ్వ) తీసుకొని.... తడినేలలో విసురుకుంటూ వెళ్ళేవాళ్ళం.... నిటారుగా కుచ్చుకోకుండా... ఫ్లాట్ గా చువ్వ పడిపోయిందంటే... ఇంకొడడు మొదలెట్టేవాడు... అలా వెంచుకుంటూ.....
ఆరుద్ర పురుగులు పట్టుకొని... అగ్గిపెట్టెల్లో దాచడం....
సీతాకొలుక చిలకల్ని పట్టడానికి ప్రయత్నించటం....
గొంగడిపురుగుల్ని ఇంట్లోకి రానీకుడా చూడటం...
అప్పడాల గుర్రాలతో ఆడటం....

చివరకు టెన్త్ క్లాస్ అయ్యాక కూడా...
ఊరి చివర్లో ఉన్న టింబర్ డిపోలో వేలానికి పెట్టిన....
కలప దుంగల వెనక దాక్కుంటూ... దాగుడుమూతలాడాం....

నిజానికి ప్రతిరోజూ డే ఎండ్ ను అద్భుతంగా... ఎంజాయ్ చేసేవాళ్ళం...
ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రతి రోజునూ  వీకెండ్ లాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం...
అనుక్షణం ప్రకృతి ఒడిలో పరవశించేవాళ్ళం....

అందుకే... శని ఆదివారాలంటే వేరుగా ఉండేది కాదు...
వీకెండ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ అవసరం రాలేదు....
ఇంకా... ఆదివారం వస్తే... ఆడటానికి టీచర్లు రారని...
ఎందుకొచ్చిందా ఈ ఆదివారమని బాధపడేవాళ్ళం...

కానీ ఈతరానికొచ్చేసరికి....
స్కూలు... స్కూలు కాగానే.. రెండు గంటల సేపు ట్యూషన్లు...
అప్పటికల్లా చీకటిపడుతుంది....
వెంటనే... టీవీ ముందుకొంచెం సేపు కూర్చొని.... పోగోనో... కార్టూన్ నెట్ వర్క్ .... చూడగానే...
తిని తొంగోవటం...

ఓ ఆరుద్ర పురుగు తెలవదు..... గొంగడిపురుగు తెలవదు...
అన్నీ.... పుస్తకాల్లోనే....
ప్రకృతంతా బొమ్మల్లోనే....
అందుకే... వీకెండ్లూ.... వీక్ బిగినింగ్లూ..........
సెలవుల కోసం ఎదురుచూపులు...
బంద్ ల కోసం జిందాబాద్ లు.....

1 comment:

  1. బాగుందీ టాపిక్.. ఆలోచింపజేస్తూ!

    ఇది కాలం తెచ్చిన మార్పు మాత్రమే కాదు; పల్లెకూ, నగరానికీ తేడా కూడా.

    >> మొదలు ఎక్కడికైనా అన్నవాడు.... ఇలా లిస్ట్ చెప్పేస్తున్నాడు>> భలే... ఇలాంటి ధోరణి కూడా ‘మన తరా’నికి లేదనుకుంటాను:)

    ఇంతకీ..‘అప్పడాల గుర్రాలం’టే?

    ReplyDelete