Thursday 7 February 2013

సిటీ లైఫ్ ....




రాత్రి ఇంటికెళ్ళేసరికి... పక్కింటి ముందర ఫంక్షన్ ఏదో జరుగుతోంది...
ఏంట్రా అని అడిగా మా అబ్బాయిని...
పక్కింటి ఆంటీవాళ్ళింట్లో పై పోర్షన్లో ఉండేవాళ్ళ ఇంట్లో బర్త్ డే అంట...అన్నాడు..
వాడవాళ్ళెవరూ కన్పించలేదు నాకు..

రాత్రి పదిన్నరైంది....
ఇంటి ముందరి అపార్ట్ మెంట్లోంచి భాజాభజంత్రీలు... (బ్యాండ్)
మోగుతున్నాయ్...
ఏంటని బయటికెళ్ళి బాల్కనీలోంచి చూశా...
సెల్లార్లో... ఆడవాళ్ళు ... ముఖం నిండా కొంగులు కప్పుకొని
రాజస్థానీ సంప్రదాయ నృత్యం చేస్తూకన్పించారు...
ఆ అపార్ట్ మెంట్లో అద్దెకుంటున్న మార్వాడీల ఇంట్లో పెళ్ళి సందడిలా ఉంది...
అది పెళ్ళో నిశ్చితార్థమో... తెలియదు
అందుకే పెళ్ళి సందడన్నాను...
ఉదయం ఆఫీస్ కు తయారవుతుంటే... మళ్ళీ భాజాలుమోగాయి...
ఈసారి చూస్తే....
సూటూబూటులో ఓ అబ్బాయి కనిపించాడు...
చేతిలో ఓ జొన్నకంకిలాంటి పొడవాటి దండం ఉంది...
సంప్రదాయ టోపీ పెట్టారు... అమ్మాయిలంతా మార్వాడీభాషలో పాటలు పాడుతూ వెంటరాగా ... పెళ్ళికొడుకు గేట్ దగ్గరకొచ్చాడు... గేట్ మూలకు స్తంభంలా ఉంది... దానికే పూజ చేశారు... ఊర్లో ఉండే పందిరి పూజలాంటిదై ఉంటుంది....
కొద్ది సేపటి తర్వాత భజంత్రీల జోరు పెరిగింది....
అప్పటిదాకా వెంట ఉన్న అమ్మాయిలు... డాన్స్ చేయటం మొదలెట్టారు... సంప్రదాయ నృత్యమే...
పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు తోడుగా కలిశారు...
మగవాళ్ళు మాత్రం చూస్తూ నిలబడ్డారు...
ఆశ్చర్యమనిపించింది....
ఎందుకంటే... మామూలుగా మార్వాడీల్లో... చాలామంది అమ్మాయిలు ముఖం మీది నుంచి కొంగు కప్పుకొని ఉంటారు...  రోడ్డుమీద నడిచేటప్పుడు కూడా...
అలాంటిది  నడిరోడ్డుపై ఆనందంగా ... స్వేచ్ఛగా వాళ్ళు డాన్స్ చేస్తుంటే... మగవాళ్ళు నిలబడి చూస్తుండటం...
బహుశా ఇది ఆచారంలో భాగమేమో అనిపించింది...
ఆచారానికి పట్టువిడుపులూ అందమేనేమో...
సర్లెండి ఇదంతా పక్కనబెడితే...
ఆ మార్వాడీ కుటుంబం తెలుసుగాని...
ఆ పెళ్ళి పిల్లాడిని మాత్రం ఎప్పుడూ చూసిన గుర్తులేదు...
మరి ఎవరబ్బా..?  ఇంతకూ
ఇది పెళ్ళా... నిశ్చితార్థమా?
మా పనిమనిషినడిగా....
ఎదురింటి అపార్ట్ మెంట్లో తన మిత్రుల సాయంతో తెలుసుకొని సమాచారం తీసుకొచ్చింది...
ఏమో వాళ్ళకూ తెలియదంట.... అని
ఎదురింటి వాళ్ళం మాకు తెలియలేదంటే  ఫర్వాలేదు... కనీసం ఒకే అపార్ట్ మెంట్లో ఉంటున్న వాళ్ళకు కూడా తెలియలేదంటే బాధేసింది...
రాత్రి బర్త్ డే ఫంక్షన్... ఈ పెళ్ళి. వేడుక... అన్నీ... ఎవరికి వారే
ఇదేనేమో సిటీ లైఫంటే...


ఇదే ఊర్లోనైతే....
ఇలాగే ఉండేదా?
ఎవరింట్లోనైనా పెళ్ళంటే... పదిరోజుల ముందు నుంచే... పక్కింట్లో కాదు... వీధివీథంతా హడావుడి...
తమదే వేడుకన్నట్లు కలసిపోతారు...
పనులెక్కడికొచ్చాయనో.... చేయటానికేమైనా పనులున్నాయా అనో..
వచ్చి మరీ అడిగిపోతారు....
ఇక అసలురోజైతే అంతా ఇక్కడే ఉండిపోతారు....

పెళ్ళిళ్ళ దాకా ఎందుకు...
మా అమ్మానాన్నా హైదరాబాద్ నుంచి ఊరికెళితే...
వాళ్ళు బయల్దేరటానికి వారం రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది...
నాన్నవాళ్ళు వస్తున్నారని... చుట్టుపక్కల వాళ్ళు పనిమనిషిని పిలిపించి ఇల్లు కడిగించి పెడతారు...
నాన్నవాళ్ళు వెళ్ళిన రోజున మధ్యాహ్నం మా ఇంటికంటే... రాత్రి మా ఇంటికి అంటూ రెండుపూటలా భోజనాలకు ముందస్తు ఆహ్వానం పలుకుతారు...
రోజూ కూరగాయల కోసం మార్కెట్ కు వచ్చే వాళ్ళలో కనీసం నలుగురైదుగురైనా
ఇంట్లోకి వచ్చి సార్ ఎలా ఉన్నారు... అంటూ పలకరించి చాయ్ తాగి వెళతరాు...
నాన్నవాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళను దగ్గరుండి మరీ బస్సెక్కిస్తారు..
వచ్చాక క్షేమంగా చేరుకున్నారా అని కబుర్లాడుతారు...

అదే మనుషులంగదా....
పల్లెటూర్ల నుంచి పట్నాలకు రాగానే మారిపోతామేం?
పల్లెటూర్లో  ఉండే బంధాలు ... అనుబంధాలు...
పట్నాలకు రాగానే మాయమవుతాయా?

కొడవటిగంటి గారన్నట్లు....
ఆకాశంలో పైకి వెళ్ళే కొద్దీ... ఆక్సీజన్ తగ్గినట్టే...
జీవితంలో పైకి వెళ్ళేకొద్దీ... బంధాలు బలహీనపడతాయంటే ఇదేనేమో....
అయినా పల్లె వీడి పట్నానికొస్తే... పైకొచ్చినట్లా?

No comments:

Post a Comment