Saturday 2 February 2013

ఎందరో మగానుభావులు... అందరికీ వణక్కం



త్యాగరాజ ఆరాధనోత్సవాలు....
టీవీలో చూపిస్తున్నారు...
ఎక్కడ నాన్నా ఇది జరుగుతోందన్నాడు  తొమ్మిదో తరగతి చదువుతున్న
మా పెద్దబ్బాయి...
తంజావూరు... తిరువయ్యార్... అని చెప్పా...

తమిళనాడు తంజావూరా? అన్నాడు...
ఔనన్నట్లు తలూపా

మరి తమిళియన్స్ తెలుగులో పాడుతున్నారేంటి? అన్నాడు....
త్యాగరాజు తెలుగుదనం గురించీ... పంచ  కృతుల గురించీ... వాడికి వివరించి.... పంపించాక అన్పించింది...

నిజమేగదా... ఈ తమిళులిలా పాడకుండుంటే... త్యాగరాజు ఏమయ్యేవాడో?
తెలుగువాడైనా త్యాగరాజును బతికిస్తున్నందుకు తమిళతంబిలకు థ్యాంక్స్ చెప్పాల్సిందే...
లేదంటే చాలామంది లాగే ఆయన్నూ ఎన్నడో చరిత్రలోకలిపేసే వాళ్ళం...

గమ్మత్తేమంటే... నిన్నటి హిందూ పేపర్లో గుడిపూడి శ్రీహరిగారు
బెంగళూరు నాగరత్నమ్మ గురించి రాసిన ఆర్టికల్ కన్పించింది...
ఆమె ఓ దేవదాసి... కన్నడిగ...
తన ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మి... దుమ్ము కొట్టుకుపోయిన త్యాగరాజు సమాధిని జీర్ణోద్ధరణ చేసిన మహానుభావురాలు...
నాడు కన్నడిగురాలు గుడి కడితే....
నేడు తమిళులు (తమిళులనే ఎందుకు మన తెలుగువారు కూడా బోలెడంత మంది అక్కడికి వెళతారని ఎవరైనా ఆక్షేపించొచ్చుగాక....) ఆ మహానుభావుణ్ణి బతికిస్తున్నారు....

మనం మాత్రం ఆయన్ను మరచిపోయాం...
ఎవరో కొంతమంది సంగీతకళాకారులకు తప్పించి...
త్యాగరాజు తెలుగువాళ్ళలో ఎంతమందికి తెలుసు?
ఈ తరానికి?
త్యాగరాజు తెలుగువాడని ఎంతమందికి తెలుసు?
ఆయన వంశం తెలుగునేలపై ఎక్కడ ఉండేదో ... ఎంతమందికి తెలుసు? 

అయినా తెలుగువాళ్ళుగా మనకు మనవాటిపై ప్రేమవేటిపై ఉందని?
అసలు మనవంటూ మనకు ఏమున్నాయని?
తమిళులకు ఇడ్లీ సాంబారు... లుంగి ఉన్నట్లు...
మనకంటూ ప్రత్యేకం ఏమైనా ఉందా?
ఉన్న కూచిపూడిని... పద్యాన్ని.... అవధానాన్ని.... ఎన్నడో ప్రదర్శన వస్తువుగా పరిమితం చేశాం....
ఇది తెలుగువాళ్ళ స్పెషల్ అని చెప్పుకోవటానికి... ఇతరులు గుర్తించటానికి...
ప్రత్యేకం ఏముందని?

కొట్టుకోవటం... తిట్టుకోవటం... బహుశా ఇదే మన స్పెషాలిటీ...

జగమెరిగిన జర్నలిస్టు... జి. కృష్ణగారు ఓ మాటన్నారు...
అప్పట్లో డర్బన్ (దక్షిణాఫ్రికా)లో తెలుగువారంతా కలసి ఓ వీధికి ఓరుగల్లు అని నామకరణం చేశారంట....  ఇది తెలిసి చాలా సంతోషమేసింది అని అన్నారాయన...
సంతోషం ఎందుకంటే... డర్బన్లో వీధికి ఓరుగల్లు అని పెట్టినందుకు కాదు...
తెలుగువారంత కలసిఒకే పేరు పెట్టినందుకు అని  కృష్ణ గారి ముక్తాయింపు....

బాగుందిగదూ...... బాపులాంటివారికి కూడా ఇన్నిరోజులు పద్మశ్రీ అవార్డు రాలేదని....
ఇప్పుడు కూడా తమిళనాడు కోటాలో వచ్చిందని గుర్తించలేని తెలుగువాళ్ళం మనం...
కాబట్టి త్యాగరాజు తెలియకపోవటంలో తప్పేం లేదు....
బహుశా నాడు త్యాగరాజైనా... నేడు బాపైనా...  ముందుచూపున్నారు కాబట్టే ... ముందే తమిళనాడెళ్ళిపోయారు....

ఎందరో మగానుభావులు.... (ను తమిళులు గా పలుకుతారు. అస్సలు పలకని దానికంటే ఏదో ఒకటి పలకటం మేలుకదా...)  అందరికీ వందనాలు అని వణక్కం పెట్టుకోవటం తప్పించి....   

అంతకుమించి ఏం చేయగలం మనం?

 

1 comment:

  1. బాగుందండీ మీరు మనవాళ్ళ గురించి రాసింది.

    అయితే... ఇంతకీ త్యాగరాజు తెలుగువాడన్నమాట!:)

    ReplyDelete