Friday 15 March 2013

దేవుడ్ని మర్చిపోదామిక.. పుస్తక పరిచయం





నేనే రాసిన పుస్తకం ‘దేవుణ్ణి మరచిపోదామిక’ - FORGET THE GOD REMEMBER SACHIN పై http://pustakam.net/?p=14238 లో యశస్వి సతీశ్ గారురాసిన సమీక్ష ఇది. ధన్యవాదాలు సతీశ్ గారు.













దేవుడ్ని మర్చిపోదామిక : ఈ పుస్తకం చదవడం పూర్తిచెయ్యగానే.. ఆలోచనలనుంచి

బయటపడడం కష్టమైంది.


ఎప్పుడో చదివిన  విషయం గుర్తుకువచ్చింది.

డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం
జరిగిందట. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను రోడ్డు ప్రమాదంలో
కోల్పోయింది.  19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు
కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown  తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా
జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను
నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving) ప్రభుత్వం మీద,
వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతు ల మీద ఒకరకంగా యుధ్ధం ప్రకటించింది. ఆమె కారణం
గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు
కాపాడిన ఘనత  సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత
విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..
అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..

రేగళ్ళ సంతోష్ కుమార్   అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు
రౌతు)  తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు
గుర్రాన్ని  పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు

మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు
నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి,
ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని..  పుట్
బాల్ లో పీలే , మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్
అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని
అన్నయ్య  అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.

నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown
ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..

ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి
అవతలవైపునే రచయిత ఫొకస్. ముందు మాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు..
ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం
ఈ.. ప్రయత్నం.

మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన
తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా
గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే  ఈ పుస్తకం.

ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో
పరాచకాలు..

కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి
క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..

ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి
ఉదాహరణ..

తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు
సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..

ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే
వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం..  అందుకే
పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి
తో రచయిత.



అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి
మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం..
తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.

“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ
గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది
నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే..

*సంతోష్ ది.. ఎంత స్వార్థం.. చిన్ని పుస్తకం **రాసేసి**.. పేపర్ల నిండా
విజయగాథలను చూడాలని కలగంటున్నాడు..*

ఒక్క తరమైనా సచిన్ లా పరిగెడితే.. కాదు .. కనీసం ఆలోచిస్తే.. మన దేశం నిస్తేజ
సాగరాన మునిగే బదులు.. ఉప్పొంగే జీవన తరంగాల వెల్లువై పులకించిపోదా!!

“నేనే కాదు..ఎవరూ పరిపూర్ణులు కారు.. కాలేరు నిరంతరం నేర్చుకోవాల్సిందే.” ఇవి
సచిన్ మాటలు గా స్వీకరిస్తే.. అక్షరాలు సిక్సర్లుగా మదిలో కి దూసుకుపోతాయి..
తిరిగి మనల్ని కష్టమైన బంతుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం చేస్తాయి.



నూతనోత్తేజం కోరే ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

ఇది లోకానికి ఓ సంతోషపు ప్రేమ కానుక లా నాకనిపించింది



 పుస్తకం: దేవుణ్ని మర్చిపోదామిక… సచిన్ ను గుర్తుంచుకుందాం (forget the
God… remember
Sachin)

రచన: రేగళ్ళ సంతోష్ కుమార్

పేజీలు: 80

ప్రచురుణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,
సికిందరాబాదు- 500009

sahrudayasantosham@gmail.com

http://kinige.com/kbook.php?id=1558&name=Devunni+Marchipodaamika



 Yasaswi' సతీష్

www.blaagu.com/sateesh



 (తెల్లకాగితం..కవిత్వ సంపుటి  రచయిత)

No comments:

Post a Comment