Monday 11 March 2013

క్రికెట్ ‘వీర’ లేవరా!



'ఎంతటి ఆటగాడైనా తానాడే స్థానాన్ని బట్టి శైలిని, ఆటతీరును సర్దుబాటు చేసుకుంటాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం...తన శైలిని కాకుండా ఆడే స్థానాన్నే పునర్‌ నిర్వచించాడు. అదే అతని గొప్పతనం.''
భారత 'మాజీ కోచ్‌ జాన్‌రైట్‌ ఇచ్చిన కితాబిది! జాన్‌రైటనే కాదు... క్రికెట్‌ తెలిసిన ఎవర్ని అడిగినా చెబుతారు సెహ్వాగ్‌ ఆటేంటో! శైలేంటో! తీరేంటో!

జట్టు పరిస్థితిని గమనిస్తాడో లేదో తెలియదు...బౌలర్‌ ఎవరన్నది పట్టించుకుంటాడో లేదో తెలియదు...బంతిని అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు...



తనకు తెలిసిందల్లా ఒక్కటే పరుగు! తానైనా పరుగెత్తాలి... బంతినైనా పరుగెత్తించాలి! ఈ క్రమంలో బంతినైనా ఇంటికి (బౌండరీకి) పంపిస్తాడు... లేదంటే తానైనా ఇంటికొ(పెవిలియన్‌కు)చ్చేస్తాడు. కుదిరిందంటే అలరిస్తాడు.... లేదంటే అయ్యో అనిపిస్తాడు. అంతే తప్ప... పరుగుల కోసం ప్రణాళికలు రచించటం... వ్యూహాత్మకంగా ఆడటం ఉండదన్నట్లుంటాడు!
సెంచరీకి చేరువవగానే ఎంతటి ఆటగాడైనా మెల్లగా ఆడేసి... వంద పూర్తి చేయటానికి ప్రయత్నించటం సహజం! అలాంటిది... ఇప్పటిదాకా తన జట్టు చరిత్రలో ఎవ్వరూ చేయని ట్రిపుల్‌సెంచరీ ముంగిట నిలబడి సిక్స్‌ కొట్టాడంటే....దాన్ని ధైర్యమందామా? మొండితనమందామా? వన్డేల్లో తన గురువు (సచిన్‌) పేరిటున్న ప్రపంచ రికార్డును (200 పరుగులు) చెరిపేసే అవకాశం వచ్చిన క్షణాన ఫోర్‌ కొట్టాడంటే దాన్ని నిర్లక్ష్యమనాలా? నిర్భయమనాలా?
ఓసారి ఇంగ్లాండ్‌ కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్టులో అబ్దుల్‌ రజాక్‌! పాకిస్థానీ తరహాలో రివర్స్‌ స్వింగ్‌ మొదలెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు ముఖ్యంగా... సెహ్వాగ్‌ సహచరుడికి ఇబ్బంది మొదలైంది. దీంతో సెహ్వాగ్‌ ఓ వ్యూహం రచించాడు. తర్వాతి బంతిని నేరుగా గ్రౌండ్‌ బయటపడేలా సిక్స్‌గా మలిచాడు. అంపైర్లకు కొత్త బంతి తీసుకోకతప్పలేదు. ''ఇక మరో గంట దాకా రివర్స్‌ స్వింగ్‌ భయం లేదు. పండగ చేసుకో'' అన్నాడు తన సహచరుడితో సెహ్వాగ్‌!

అందుకే... జాన్‌రైట్‌లాంటివాళ్ళు తెలివైన వాడని కితాబిస్తే... జెఫ్రీ బాయ్‌కాట్‌లాంటివాళ్ళకది తెలివైన మూర్ఖత్వంలా కనిపించింది! ఎవరేమనుకున్నా తన తీరుకు సెహ్వాగ్‌ పెట్టుకున్న పేరు సహజ శైలి! ఏమైతే అదవుతుంది... నా శైలి నాది అనే ఆ తత్వమే సెహ్వాగ్‌తో ఇన్నాళ్ళూ పరుగులు పెట్టించింది. ఇప్పుడు అదే కెరీర్‌కు ప్రమాదంగా పరిణమించింది కూడా!

నిజానికి.... వివ్‌ రిచర్డ్స్‌లోని విధ్వంసం... డేవిడ్‌ గ్రోవర్‌లోని శిల్పం... విశ్వనాథ్‌లోని విన్యాసం.... సచిన్‌లోని నైపుణ్యం... ఇన్నింటి కలబోత వీరేంద్ర సెహ్వాగ్‌! తనంతగా ఏ బౌలర్‌నూ ఏ క్షణంలోనూ లెక్కచేయకుండా... ధైర్యంగా ఆడిన మరో బ్యాట్స్‌మెన్‌ సమకాలీన క్రికెట్‌లో ఉండడంటే అతిశయోక్తికాదు.

ఏ ఆటగాడైనా ఒకసారి ఔటైనట్లుగా మరోసారి ఔట్‌కావాలని కోరుకోడు! తప్పులెక్కడ చేశానో చూసుకొని సర్దుకుంటాడు! కానీ వీరూ రూటే వేరు! తొలి ఇన్నింగ్స్‌లో ఔటైనట్లే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఔటవుతాడు! సర్దుకోవటాలు... సరిదిద్దుకోవటాలు లేవన్నట్లు ఆడతాడు! అందుకే ఛాపెల్‌ లాంటివాళ్ళకు కొరుకుడు పడని కొయ్యగా మిగిలిపోయాడు! నిజానికి వీరూ విధ్వంసక ఇన్నింగ్స్‌లో చాలామటుకు ఆ ధోరణితో వచ్చినవే! అభిమానుల్ని మెప్పించినవే! వయసులో ఉన్నంత కాలం అది బాగానే నడిచింది! కానీ ఇప్పుడు... 36 దాటుతున్నాడు. శరీరకదలికల్లో... సమన్వయంలో తేడా వస్తుంది... వస్తోంది! ఇన్నాళ్ళు ఆడినట్లే ఇప్పుడూ ఆడతానంటే కుదరకపోవచ్చు. సర్దుబాట్లు తప్పకపోవచ్చు. సచినంతటివాడే శరీరం సహకరించక కొన్ని షాట్లను అస్త్రసన్యాసం చేసేశాడు. ఆటతీరును మార్చుకున్నాడు. వీరూ చేయాల్సిందల్లా ఇప్పుడు మానసికంగా మారటమే! శరీర ధర్మాన్ని అనుసరించి సర్దుకోవటానికి సిద్ధపడటమే! ఆ నిర్ణయం తీసుకోవటానికి వీరూ సిద్ధపడతాడా? లేదా? అనేదే ఆసక్తికరం!

అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్‌ కెరీర్‌ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్‌ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు!
అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్‌ కెరీర్‌ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్‌ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు! చివరకు సెహ్వాగ్‌ కూడా! గతంలో ఓసారి ''మీకూ సచిన్‌కు తేడా ఏంటంటే...'' - ''బ్యాంక్‌ బ్యాలెన్స్‌'' అని ఓసారి బదులిచ్చాడు వీరూ! నాడు పరాచికానికే ఆ మాట అన్నప్పటికీ... ఇప్పుడు నిజంగానే తన గురువుకూ తనకూ ఉన్న తేడా అదేనని నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది! అంటే... గడ్డుకాలాన్ని దాటి మళ్ళీ పరుగులెత్తించే సత్తా తనలో ఉందని నిరూపించుకోవాలిప్పుడు! అలా మళ్ళీ సిద్ధమైన తర్వాత... ఓపెనింగ్‌ కాకుంటే నాలుగోస్థానంలో దిగొచ్చేమో! ఎలాగూ తొలినాళ్ళలో తన స్థానమదే! బహుశా మొదలెట్టిన చోటే ముగించే అవకాశం దొరుకుతుందేమో!

అందుకే... 'వీరు'డా లే!

లోకమంతా క్యారమ్‌ బాల్‌ను చూసి కకావికలవుతున్న వేళ....
కాలు కదపకుండా సింహనాదం చేసి
అజంతా మెండిస్‌ అనే బౌలర్‌ను చరిత్రలో కలిపేసిన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకో!

తాండవాలు చేయకుండా....
తారంగంలా చేతులూపి....బ్యాట్‌ తిప్పి... ట్రిపుల్‌ సెంచరీతో
పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ముల్తాన్‌ క్షణాల్ని స్మరించుకో!

శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టు జట్టంతా 329 చేస్తే...
అందులో నీవొక్కడివే 201 చేశావని జ్ఞాపకం చేసుకో!

చెన్నైలో దక్షిణాఫ్రికాపై...
ఒక్కరోజులోనే 257 పరుగులు చేశావనీ...
304 బంతుల్లోనే 319 సాధించావనీ..
ఇప్పటికీ నీ స్త్ట్రెక్‌రేట్‌ 82.33 అనీ...
గుటక వేసినంత సులభంగా ఫోర్లు కొట్టగలవనీ...
నీళ్ళు తాగినంత అలవోకగా సిక్స్‌లు బాదగలవనీ...
ఏటీఎంలో డబ్బులు తీసినంత సులువుగా సెంచరీలు చేయగలవనీ..
ఒక్కసారి మననం చేసుకో....!!

ఘనంగా ముగించు... జనంలో ముగించు!



( మార్చి 9, శనివారం, 2013న ఈనాడులోప్రచురితమైన నా కథనం ఇది)  

3 comments:

  1. మహాభారతంలో తన ధనుష్టంకారంతోనే శత్రువులను బెంబేలెత్తించిన సవ్యసాచి అర్జునుడు కూడా చరమదశలో గాండీవం ఎక్కుపెట్టలేకపోతాడు..

    ఇలాంటి సందర్భాలు క్రీడికైనా, క్రీడాకారులకైనా విచారకరమే!

    అరుదైన సెంచరీల చేరువకొచ్చిన క్షణంలో కూడా అదేమీ పట్టనట్టు, లెక్కలేనట్టు సహజశైలిలో బ్యాటింగ్ ఝళిపించే సెహ్వాగ్ తెగువ అనుపమానం..అనితర సాధ్యం.

    మీ కథనం శీర్షిక బాగుంది. ముగింపు ప్రత్యేకంగా ఎంతో టచింగ్ గా ఉంది.

    ReplyDelete